హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అడ్డగోలు మార్పులు చేసి.. చిన్న, సన్నకారు రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కా రు చెలగాటమాడుతున్నదని ఆగ్రహంతో ఉన్న అన్నదాతలు వినూత్న నిరసనకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. జూబ్లీహిల్స్ బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. పసుపు బోర్డు హామీని అటకెక్కించారని మండిపడు తూ, ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టేందుకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున నామినేషన్లు వేసిన తరహాలోనే జూబ్లీహిల్స్‌లో ట్రిపుల్ఆర్ బాధిత రైతులు పోరుకు సిద్ధమైన ట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. వందలాది మంది రైతులు నామినేషన్లు వేయ డం ద్వారా తమ ఆవేదనను రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినిపించి, చర్చకు పెట్టే అవకాశం కలుగుతుందని బాధిత రైతుల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే పెద్దల భూముల కోసం చిన్న రైతులను బలిపెట్టేలా ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం అలైన్మెంట్లో మార్పులు చేశారని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వంకర్లు తిరిగిన ఆలైన్‌మెంట్‌లో తప్పులను సమాజం ముందుంచి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 200 మంది రైతులు నామినేషన్లు వేయాల్సిందేనని జేఏసీ సభ్యులు సమాలోచనలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన సెగ తగలాలంటే పోటీ తప్పదని భావిస్తున్నారు.
ట్రిపుల్ఆర్ పాత ఆలైన్మెంట్తో కా కుండా స్వప్రయోజనాల కోసం వేలాది మంది రైతుల భూములపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారు ఆలైన్‌మెంట్‌లో మార్పులు చేసిందని బాధితుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌పై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలు దాటి మహానగరానికి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. అలైన్మెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఐదు సార్లు రోడ్డెక్కిన ట్రిపుల్ఆర్ బాధితులకు… ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రధాన వేదికగా మార్చుకుని, తమ భూములను కాపాడుకోవాలని భావిస్తున్నారు. ఓవైపు ఆందోళనలు చేస్తూనే… మరోవైపు నామినేషన్లు దాఖలు చేయడం ద్వారా కాంగ్రెస్ పాలకుల అక్రమాలను నిలదీయవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలో రైతులు నామినేషన్లతో ముందుకు వస్తే.. రేవంత్ రెండేండ్ల పాలన, కాంగ్రెస్ విధానాలు, అమలుకు నోచుకోని గ్యారెంటీలు ప్రజాక్షేత్రంలో విస్తృతమైన చర్చకు వస్తాయని, కాంగ్రెస్ ప్రతిష్ఠ మరింత దిగజారే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.