పూడూరు,సెప్టెంబర్ 25: భూస్వాములు, రియల్ వ్యాపారులు, నాయకుల భూములు తప్పించి సన్న కారు రైతుల పొలాల నుంచి ట్రిపుల్ఆర్ రోడ్డు అలైన్మెంట్ చేయడం సరైంది కాదని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల దేవాలయం వద్ద ట్రిపుల్ఆర్ను వ్యతిరేకిస్తూ బాధిత రైతులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీ కొండా మాట్లాడుతూ ప్రస్తుతం అలైన్మెంట్ చేసిన రోడ్డును రద్దుచేసేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎంను కలిసి రైతులకు జరుగుతున్న అన్యాయంపై తెలియజేస్తానని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల భూములకు రక్షణగా ఉంటానని, అధైర్య పడవద్దని, కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి భూములు గుంజుకొని మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు బోనేటి కిరణ్‌కుమార్, శరత్‌కుమార్‌రెడ్డి, సీపీఎం వ్యవసాయశాఖ కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకటయ్య మాట్లాడుతూ ట్రిపుల్ఆర్ రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు.