బాసర/డిచ్పల్లి, ఆగస్టు 23: బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యార్థి సురేశ్ రాథోడ్ (20) హాస్టల్ గదిలో ఉరేసుకొని మంగళవారం ఆత్మహత్య చేసుకొన్నా డు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తండాకు చెందిన సురేశ్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హాస్ట ల్ గదిలో సురేశ్ ఉరేసుకొన్నట్టు గుర్తించిన విద్యార్థులు అధికారులకు సమాచారమిచ్చారు. కొన ఊపిరితో ఉన్న సురేశ్‌ను అధికారులు తొలుత ట్రిపుల్ఐటీలోని దవాఖానకు, ఆ తర్వాత భైంసాకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నిర్మల్‌కు తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఘటనా స్థ్థలాన్ని ఎస్పీ ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. విద్యార్థికి సంబంధించిన సెల్‌ఫోన్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సురేశ్ సెల్‌ఫోన్ ఆధారంగా చేపట్టిన విచారణలో అతను వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకొన్నట్టు తెలిసిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సురేశ్ మృతితో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దవాఖాన ఎదుట రెండు గంటలపాటు బైఠాయించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.