బాసర, జూలై 5: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల జాబితాను ఆర్జీయూకేటీలో వీసీ గోవర్ధన్ విడుదల చేశారు. మహబూబ్‌నగర్, బాసర కలిపి మొత్తం సీట్లకు 1,690 మందిని ఎంపిక చేసి జాబితాను ప్రకటించారు. ఇందులో అమ్మాయిలు 72 శాతం ఉండగా.. అబ్బాయిలు 28 శాతం సీట్లు సాధించారు. ప్రభుత్వ పాఠశాల నుంచి 88శాతం సీట్లు.. ప్రైవేటు నుంచి 12శాతం సీట్లు సాధించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు వచ్చిన మార్కులకు అదనంగా 24 మార్కులు కలిపారు. 33 జిల్లాల్లో నిజామాబాద్ జిల్లాకు 297 సీట్లు రాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఒక సీటు లభించింది.
కౌన్సెలింగ్ తేదీలివే..
ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు ఈనెల 7, 8, 9వ తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 7వ తేదీన 1-564 నంబర్ వరకు.. 8వ తేదీన 565 నుంచి 1128 వరకు.. 9వ తేదీన 1129 నుంచి 1690వ నంబర్ వరకు విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలవనున్నారు.
ఆ ఐదు జిల్లాలకే ఆర్జీయూకేటీలో సగం సీట్లు
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ)లో సింహభాగం సీట్లను రాష్ట్రంలోని ఐదు జిల్లాల విద్యార్థులే కైవసం చేసుకున్నారు. ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు మొదటి విడత సీట్లను శుక్రవారం కేటాయించారు. మొత్తం 1,690 సీట్లు భర్తీ అయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా విద్యార్థులు 297 సీట్లు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి 222, కామారెడ్డి 128, మహబూబాబాద్ 125, రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థులు 117 చొప్పున సీట్లు కైవసం చేసుకున్నారు. ఈ ఐదు జిల్లాల విద్యార్థులే 888సీట్లు సొంతం చేసుకున్నారు. అంటే సగం సీట్లు వీరే ఎగరేసుకుపోయారన్న మాట. ఇక అత్యల్పంగా సీట్లు దక్కించుకున్న జిల్లాలు తీసుకుంటే జయశంకర్భూపాలపల్లి 1, వనపర్తి 4, కుమ్రంభీం ఆసిఫాబాద్ 5, వరంగల్, వికారాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆరుమంది చొప్పున సీట్లు దక్కించుకున్నారు.
243 మాడల్ విద్యార్థులకు సీట్లు
మాడల్ స్కూల్లో చదివిన 243 మంది విద్యార్థులు బాసర ఆర్జీయూకేటీలో సీట్లు సాధించినట్టు తెలంగాణ మాడల్ స్కూ ల్స్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసచారి ప్రకటనలో తెలిపారు. 63మంది బాలురు, 180మంది బాలికలు సీట్లు పొందినట్టు వెల్లడించారు. వీరిలో ఒకే స్కూల్ నుంచి గరిష్ఠంగా 15 మంది, కనిష్ఠంగా 11 మంది వరకు సీట్లు పొందిన వారున్నారు.