ముషీరాబాద్, ఆగస్టు 9: ఎస్సీ వర్గీకరణకోసం ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరులకు వర్గీకరణ విజయాన్ని అంకితం చేస్తూ ఈ 13న నివాళి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం విద్యానగర్లోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాలవల్లనే వర్గీకరణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుందని, రేపు వర్గీకరణ ఫలితాలు అనుభవించనున్న ప్రతి కుటుంబం రుణపడి ఉంటుందని తెలిపారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ అంబేద్కర్, అమరవీరుల విగ్రహాలు, చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బండారు శ్రీనివాస్, చాప కృష్ణ, వేణు, యాకన్న, రాజేశ్, కొల్లూరి వెంకట్, రాజేందర్ పాల్గొన్నారు.