
హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం పైలట్ ప్రాజెక్టులో భాగంగా నూతన పరికరాలను రూపొందించిన నలుగురు యువకులను తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెంటర్ (టీఎస్ఐసీ) గణతంత్ర దినోత్సవంగా సందర్భంగా సత్కరించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆజంనగర్‌కు చెందిన ఏదులాపురం శశిధర్, ములుగు జిల్లా పాలంపేటకు చెందిన ఒల్లాల సాయికుమార్, మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన టీవీ మెకానిక్ వెల్లె శ్రీనివాస్, వనపర్తి జిల్లా పామిరెడ్డిపల్లెకు చెందిన బరిగె సాయిప్రణీత్రావు టీఎస్ఐసీ ఇంటింటా ఇన్నోవేటర్ గ్రామీణ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిని బుధవారం ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు సత్కరించారు. గ్రామీణ యువతను కొత్త ఆవిష్కరణల వైపు మళ్లించాలనే సంకల్పంతో పైలట్ ప్రాజెక్టుగా నాలుగు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ అధికారి శాతం థౌటం పేర్కొన్నారు. వచ్చే ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు.
సన్మానగ్రహీతల నూతన ఆవిష్కరణలు
ఆజంనగర్‌కు చెందిన ఏదులాపురం శశిధర్ చీకటిగా ఉన్నప్పుడు గ్రామంలోని వీధిలైట్లు ఆటోమేటిక్‌గా వెలిగి, వెలుతురు రాగానే వాటంతటవే ఆరిపోయేలా ప్రత్యేక పరికరాన్ని రూపొందించాడు. దీనివల్ల విద్యుత్తు ఆదా అవుతున్నది.
పాలంపేటకు చెందిన ఒల్లాల సాయికుమార్ రైతులు, వికలాంగులు, ఎలక్ట్రీషియన్ల కోసం వివిధ రకాల పరికరాలను రూపొందించాడు. విద్యుత్తును ఆదా చేయడంతోపాటు కరెంట్ షాక్ తగలకుండా ఇవి ఉపయోగపడతాయి.
బయ్యారానికి చెందిన టీవీ మెకానిక్ వెల్లె శ్రీనివాస్ సోలార్ విద్యుత్తుతో పనిచేసే అత్యాధునిక ఆటోమేటిక్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను రూపొందించాడు. దీనిని పొలం మధ్యలో అమర్చితే నేలపై ఉన్న తేమ ఆధారంగా ఆటోమేటిక్‌గా మోటర్‌ను ఆన్ చేసి, నీరు పారే విధంగా చేస్తుంది.
పామిరెడ్డిపల్లెకు చెందిన బరిగె సాయిప్రణీత్రావు పాఠశాల టాయిలెట్లలో వినూత్న వాల్ మౌంటెడ్ కమోడ్లను ఆవిష్కరించాడు. విద్యార్థుల కనిష్ఠ, గరిష్ఠ ఎత్తుల ఆధారంగా అందరికీ అనువైన పద్ధతిలో వీటిని అమర్చాడు. ఇందుకు పాఠశాల ఉపాధ్యాయులు సహకారం అందించారు.