సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ వేగంగా సాగు తోందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, అదనపు కమిషనర్ సంతోష్‌లతో కలిసి కర్ణన్ జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓట్ల వివరాల సేకరణకు ఇంటింటి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు వంద శాతం పూర్తయిందని కర్ణన్ వెల్లడించారు. సేకరించిన ఫారాలలో ఇప్పటికే 26 శాతం డేటాను డిజిటలైజ్డ్ చేశామని పేర్కొన్నారు. ఓటర్లందరూ తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి త్వరగా సమర్పించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఫారాల సమర్పణకు వచ్చే నెల 3వ తేదీ తుది గడువు ఉంటుందని, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఓటర్లు తమ వివరాలను అందజేయాలని తెలిపారు.
ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి ప్రచారం, ఆటోల ద్వారా మైకు ప్రచారం, పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా ప్రకటనలు, ప్రధాన కూడళ్లలో హోర్డింగ్‌లు, బ్యానర్ల ఏర్పాటు వంటి విస్తృత అవగాహన కార్యక్రమాలను జీహెచ్ఎంసీ చేపట్టిందన్నారు. రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు, కాలనీ అసోసియేషన్లు సమావేశాలు నిర్వహిస్తున్నామని, ట్యాక్స్ పేయర్లకు ఎస్ఎంఎస్ సందేశాలు పంపుతున్నట్లు కర్ణన్ తెలిపారు. ఎవరికైనా ఇంకా ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే వెంటనే సంబంధిత బీఎల్ఓ, సూపర్వైజర్ను సంప్రదించాలని సూచించారు. టోల్‌ఫ్రీ నంబరు 1950కి కాల్ చేసి ఫారం పొంది గడువులోగా సమర్పించాలన్నారు. బంజారాహిల్స్‌లో బూత్ లెవల్ ఆఫీసర్‌పై దాడి జరిగిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేయించామని తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు పోలింగ్ స్టేషన్లకు చెందిన 2002 ఓటర్లు లిస్ట్ మిస్ అయిందని, ఆ ఓటర్లందర్నీ స్పెషల్‌గా కన్సిడర్ చేసి ఫారాలు పూరించనున్నట్లు కమిషనర్ కర్ణన్ తెలిపారు.
24 శాతం మంది ఏఎస్డీ ఓటర్లే
ఓటర్ల జాబితా పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెల్లడైనట్లు కమిషనర్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో దాదాపు 24 శాతం మంది ఓటర్లు ఏఎస్డీ ( ఏ-లేనివారు, ఎస్-వలస వెళ్లినవారు, డీ-మరణించినవారు) మూడు విభాగాల కింద ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని స్పష్టం చేశారు. ఈ జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందిస్తామని కర్ణన్ వెల్లడించారు.
నగరంలో సర్ వివరాలు
జిల్లా ఓటర్లు 47,36,669
ఫారాల పంపిణీ 100 శాతం పూర్తి
ఆన్లైన్లో నమోదు – 3,73,349 (7.88శాతం మంది)
ఫారాల డిజిటలైజేషన్ పూర్తి -12,08,935 (25.52 శాతం)
ఏఎస్డీ ఓటర్లు గుర్తించినవి – 11,52,613 (24.33 శాతం)
డిజిటలైజేషన్ పూర్తి కావాల్సిన ఫారాలు – 23, 75, 121