గ్రేటర్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ అభాసుపాలవుతోంది. క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులు, బీఎల్ఓల సాంకేతిక లోపాల నడుమ గందరగోళ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల అధికారి, సర్ తుది గడువును వచ్చే నెల ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించడం కాస్తా ఉపశమనం కల్పించే అంశమే ఐనప్పటికీ సమన్వయ లేమితో మున్ముందు కూడా పరిస్థితి మారుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడువు పెంచినా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు కొలికి రాకపోతే ఈ పొడిగింపు నిష్ప్రయోజనమేనని ఓటర్లు, విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.
సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ) : నగరంలో అధికారిక లెకల్లో ఫారాల పంపిణీ వంద శాతం పూర్తయిందని అధికారులు రికార్డులు చూపిస్తున్నా, వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఫారాల పంపిణీ ప్రక్రియ ఇంకా బాలరిష్టాలు దాటలేదు. చాలా చోట్ల బూత్ స్థాయి అధికారులు (బీఎల్ ఓలు) అసలు ఓటర్లకు అందుబాటులోనే లేకుండా పోయారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు వంద శాతం ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు అధికారుల అంకెలు..క్షేత్రస్థాయిలో ఓటర్ల ఆందోళనలకు అద్దం పడుతున్నాయి. లెక్కలను పరిశీలిస్తే ఈ నెల 6న ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో ఫారాల పంపిణీ 69.35 శాతం పూర్తయినట్లు పేర్కొన్నారు.
తిరిగి ఆదే రోజు రాత్రి 8 గంటలకు కేవలం 12 గంటల్లోనే 76.36 శాతానికి చేర్చారు. అంటే ఒకే రోజులో ఏకంగా 3,31,567 ఫారాలు పంచినట్లు లెక్కలు చూపించారు. జూలై 7 నాటికి 78.75 శాతం ఉదయం 8 గంటల వరకు చూపించగా…రాత్రికి 87.48 శాతం చేర్చారు. ఈ రెండు రోజుల్లో సగటున ప్రతి బీఎల్ఓ రోజుకు 106 ఫారాలను పంపిణీ చేసినట్లు రికార్డులు చెబుతుండగా..క్షేత్రస్థాయిలో ఇది ప్రాక్టికల్‌గా అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఏఈఆర్వోపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పలువురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బీఎల్ఓలు వాడే యాప్‌లలో డేటాను మార్చే అవకాశం లేకపోయినప్పటికీ పెనాల్టీల నుంచి తప్పించుకోవడానికి కొందరు ఏఈఆర్ఓలు యాప్‌లో తప్పుడు లెక్కలను నమోదు చేసి చూపించడం గమనార్హం. మొత్తంగా ఫారాలను అందని వారంతా లక్షల్లోనే ఉంటారని, వారు ఓటు కోల్పోయే అవకాశాలే ఎక్కువన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీఎల్ఓల జాడ కోసం ఓటర్ల వెతుకులాట
బీఎల్ఓలు ఎక్కడటూ పోలింగ్ కేంద్రాల చుట్టూ ఓటర్లు వెతుకులాడాల్సిన దుస్థితి తలెత్తింది. నిబంధనల ప్రకారం బూత్ స్థాయి అధికారులు(బీఎల్ఓలు) ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి ఫారాలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ నగరంలోని మెజారిటీ ప్రాంతాల్లో ప్రక్రియ సజావుగా సాగడం లేదు. బీఎల్ఓలు ఇళ్ల వద్దకు వెళ్లకుండా స్థానిక పాఠశాలలు, మైదానాలు, నివాసితుల సంక్షేమ సంఘాల కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లకే పరిమితమవుతున్నారు. ఓటర్లే స్వయంగా అక్కడికి వెళ్లి ఫారాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చొరవ చూపని ఓటర్ల ఫారాలన్నీ అధికారుల వద్దనే మూలన పడుతుండడం శోచనీయం.
నత్తనడకన డిజిటలైజేషన్..
సవరించిన ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియ నత్తనడకను తలపిస్తోంది. ఇప్పటివరకు కేవలం 25.52 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తి కావడం గమనార్హం. ఇంత మందకొడిగా సాగడం వెనుక ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే వేగంతో వెళ్తే పెంచిన గడువు లోపల డిజిటలైజేషన్ వంద శాతం పూర్తి కావడం అసాధ్యంగా కనిపిస్తోంది. ప్రధానంగా మరోవైపు క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన బీఎల్ఓలకు సాంకేతిక అడ్డంకులు శాపంగా మారాయి. ఓటర్ల వివరాలను నమోదు చేద్దామంటే ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన అధికారిక యాప్‌లు, వెబ్సైట్లు మొరాయిస్తున్నాయి. నిరంతరం సర్వర్ డౌన్ సమస్య తలెత్తుతుండటంతో గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని బీఎల్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇటు ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిపోతుంటే, అటు సాంకేతికత సహకరించక సతమతమవుతున్నారు.
గందరగోళంలో ఓటర్ల భవిష్యత్తు
ఓటర్ల జాబితా సవరణల్లో చోటుచేసుకుంటున్న ఈ అస్తవ్యస్త విధానాలతో ఓటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అర్హులైన ఎంతోమంది ఓట్లు గాల్లో కలిసిపోతాయేమోనని, అనర్హుల ఓట్లు తిష్ట వేస్తాయేమోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అధికారి ఆగస్టు 3వరకు గడువు పొడిగించినప్పటికీ… సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోకపోతే ఓటర్ల భవిష్యత్తు మరింత గందరగోళంలో పడడం ఖాయంగా కనిపిస్తున్నది.