మహబూబ్‌నగర్ అర్బన్, మే 28 : తెలంగాణ వైతాళికుడిగా సురవరం ప్రతాపరెడ్డి ఒక ప్రాంతానికి.. వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన జీవిత చరిత్రను నేటి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో మంగళవారం సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సురవరం కపిల్, నివేదిత తదితరులతో కలిసి సురవడం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సమాజం మొత్తం బాగుపడాలనే ఉద్దేశంతో సురవరం పనిచేశారని కొనియాడారు. ఆయన ఆస్తులను త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి అని కీర్తించారు. తెలంగాణలో కవులే లేరని చెప్పిన రోజుల్లో 350 మంది కవులతో కూడిన గోల్కొండ కవుల సంచికను ప్రకటించి విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ సాహిత్యానికి జాతీయ స్థాయిలో సురవరం గుర్తింపు తీసుకొచ్చి, ప్రజలను చైతన్యపరచడంలో కీలకపాత్ర పోషించిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అలాంటి మహానుభావుడు పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గర్వకారణమని అన్నారు.