హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి ఆత్మార్పణం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కీలక ఘటనల్లో శ్రీకాంతాచారి ఆత్మర్పాణం ఒకటి అని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేందుకు తన శరీరాన్ని సమిధలా మార్చిన ఉద్యమవీరుడని కీర్తించారు.
దివ్యాంగులకు కాంగ్రెస్ మోసం
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేటీఆర్ దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించేందుకు మనమందరం ప్రతినబూనుదాం అని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలోనే దివ్యాంగులకు మేలు చేకూరిందని పేర్కొన్నారు. రూ.4016 పింఛన్ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏటా ఆసరా పింఛన్ల కింద రూ.10 వేల కోట్లు ఖర్చుచేసినట్టు తెలిపారు. నెలకు రూ.6 వేల పింఛన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని ధ్వజమెత్తారు. దివ్యాంగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హామీలు అమలు చేసేవరకు కాంగ్రెస్ వెంటపడుతామని స్పష్టంచేశారు.
శ్రీకాంతాచారి పోరాటం వృథా కాలేదు: మాజీ మంత్రి హరీశ్‌రావు
మలి తెలంగాణ పోరాటంలో బలిదానానికి పాల్పడ్డ శ్రీకాంతాచారి పోరాటం వృథాకాలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నవంబర్ 29న కేసీఆర్ అరెస్ట్‌ను తట్టుకోలేక, స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం తన దేహాన్ని అగ్నికి ఆహుతి ఇచ్చిన శ్రీకాంతాచారి బలిదానం కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఉద్యమ ఆకాంక్షను రగిల్చిందని గుర్తుచేశారు. శ్రీకాంతాచారిని తెలంగాణ సమాజం ఏనాటికీ మరువబోదని చెప్పారు.