సిర్పూర్(టీ)/దహెగాం, సెప్టెంబర్ 9 : కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నామని, వెంటనే తమ గ్రామాలకు రోడ్లు వేయాలని, దవాఖానలు ఏర్పాటు చేయాలని ఆదివాసీ మహిళలు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను వేడుకున్నారు. ఇటీవల కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం చిన్నమాలిని గ్రామానికి చెందిన గర్భిణి కోర్రం శ్రీదేవి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఆయనకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. సిర్పూర్(టీ) నియోజకవర్గంలో గిరిజనులు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. గర్భిణి మరణానికి ప్రభు త్వం, ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.