కుమ్రంభీం ఆసిఫాబాద్/ఆదిలాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ) : ఆదివాసీలకు నష్టం కలిగించే టైగర్ కన్జర్వేషన్ జీవో నంబర్ 49ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతమైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో బంద్ సంపూర్ణంగా కాగా, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో పాక్షికంగా కొనసాగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు విద్యా సంస్థలు బంద్ పాటించా యి.
ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయి. దీంతో ఉదయం నుంచే మార్కెట్ నిర్మానుష్యంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు కదలకుండా ఆదివాసీ సంఘాలు అడ్డుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లా కేంద్రంతోపాటు ఉట్నూ ర్, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్ ఇతర ప్రాంతాల్లో బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పులుల రక్షణ కోసం ఆదివాసీలను అడవుల నుంచి తరిమేసే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఆదివాసీల బతుకులను ఆగం చేస్తుందని మండిపడ్డారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కన్జర్వేషన్గా మారుస్తూ గత నెల 30న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 49కు వ్యతిరేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టారు. ఇందుకు దిగివచ్చిన సర్కార్ జీవో 49 అమలును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్కు సూచించారు.