ఇనుగుర్తి, జూన్ 17: పోడు భూముల్లో అటవీ అధికారులు చేపడుతున్న ట్రెంచ్ పనులను రైతులు అడ్డుకున్నారు. మహిళా రైతు జేసీబీకి అడ్డుగా పడుకున్నారు. ఈ క్రమంలో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెకొన్నాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాత తండాలో మంగళవారం చోటుచేసుకున్నది. పాత తండా జీపీ పరిధిలోని గిరిజన రైతులు తమ తాతల కాలం నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏటా వర్షాకాలం ప్రారంభంతో గిరిజన రైతులు, అటవీశాఖ అధికారులకు మధ్య గొడవలు జరుగుతుండేవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు అటవీ హక్కు పత్రాలు ఇచ్చిందని గిరిజన రైతులు చెప్తున్నారు.
ఆ భూముల్లోనే సాగుచేసుకుంటుంటే అటవీ అధికారులు దౌర్జన్యంగా వచ్చి ట్రెంచ్ తీస్తున్నారని అడ్డుకున్నారు. అటవీ హక్కు పత్రాలు చూపించినా అటవీ అధికారులు వినలేదని గిరిజనులు మండిపడుతున్నారు. అధికారుల కాళ్లు మొక్కినా కూడా కనికరం చూపించడం లేదని ఓ గిరిజన మహిళ కన్నీటి పర్యంతమైంది. అటవీ అధికారులు, గిరిజనుల మధ్య జరిగిన తోపులాటలో ఓ గిరిజన మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న కేసముద్రం ఎస్సై మురళీధర్రాజ్ గొడవ పడకుండా సమస్యను పరిష్కరించుకోవాలని వారికి సూచించారు. దీంతో ములుగు డివిజనల్ అటవీ అభివృద్ధి శాఖ మేనేజర్ మాధవి వచ్చి అటవీ హక్కు పత్రాలు వారంలో సమర్పించాలని రైతులకు చెప్పి వెళ్లిపోయారు.