భద్రాద్రి కొత్తగూడెం : అటవీ శాఖ రేంజ్ అధికారిపై ఆదివాసీలు గొడ్డలితో దాడి చేశారు. చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేంజర్ శ్రీనివాసరావు మండల అధికారి సంజీవరావుతో కలసి అడవుల్లో చెట్లు నరుకుతున్న గుత్తి కోయల వద్దకు వెళ్లారు. చెట్లను నరకవద్దని గుత్తి కోయలకు అధికారులు ఇద్దరూ సూచించారు. తమను అడ్డుకోవద్దని అధికారులను బెదిరించారు.
అంతటితో ఆగకుండా రేంజర్ శ్రీనివాసరావుపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో రేంజర్ శ్రీనివాసరావు అక్కడే పడిపోయారు. తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతున్న శ్రీనివాసరావును అటవీ సిబ్బంది హుటాహుటిన కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. అధికారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.