కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కారిడార్‌గా ఏర్పాటు చేస్తుండటాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. శనివారం జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు వందలాదిగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని భారీ ర్యాలీ తీశారు. తుడుం వాయిద్యాలతో కుమ్రంభీం చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు చేరుకొని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి వివేకానంద చౌక్ మీదుగా కలెక్టరేట్ వరకు కదం తొక్కారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి టైగర్ కారిడార్ వద్దే వద్దంటూ నినాదాలు చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి్మ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎంపీ సోయం బాబురావు మద్దతు ప్రకటించి.. ఆందోళనలో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన ఆందోళన సుమారు ఐదుగంటలపాటు కొనసాగింది.
సర్కారు వెనక్కి తగ్గకపోతే మరో కుమ్రంభీం పోరాటం మొదలవుతుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు కేసీఆర్ పట్టాలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నదని విమర్శించారు. టైగర్ కారిడార్ పేరుతో ఏకంగా గిరిజనుల భూములను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. టైగర్ కారిడార్ పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 49ని వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలంతా ఏకమై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఇంద్రవెల్లి సభలో ఆదివాసీలపై ప్రేమను ఒలకబోసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆసిఫాబాద్ జిల్లా గిరిజనులపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని అడవులను ఆక్రమించేందుకు జింకలను చంపిన రేవంత్‌రెడ్డి సర్కార్.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులులను కాపాడేందుకు ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలోని మారుమూల గ్రామాలకు ఇప్పటికే రోడ్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, ఆదివాసీలు నివసించే ఆసిఫాబాద్ అడవులను ఖాళీచేయించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్‌కు రూ.7,700 కోట్ల నిధులు తెస్తున్న ప్రభుత్వం ఐటీడీఏను ఎందుకు నిర్వీర్యం చేస్తుందో చెప్పాలని, ఆదివాసీల బతుకులు ఆగం చేసేందుకు ప్రయత్నిస్తే ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని హెచ్చరించారు.