ఖమ్మం, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సైనికుడిగా దేశ రక్షణ కోసం శ్రమించిన గిరిజన యువకుడు ఆర్మీ రవి అలియాస్ బానోత్ రవి సర్పంచ్‌గా విజయం సాధించాడు. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ముజాహిద్పురంలో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించాడు. బీఆర్ఎస్ నేతగా కొనసాగుతున్న రవి కాంగ్రెస్ ఆగడాలను, ప్రజావ్యతిరేక విధానాలను సోషల్ మీడియాలో ఎండగడుతూ వచ్చాడు. దీంతో గత రెండేండ్లుగా అనేక వేధింపులు, కేసులను సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది.

అయినా ఏమాత్రం నెరవకుండా ప్రజలను జాగృతం చేయడంలో తనదైన పాత్ర పోషించారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ముజాహిద్‌పురం సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసిన ఆర్మీ రవిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక వ్యూహాలు రచించినా ప్రజామద్దతు ముందు అవి ఏమీ పనిచేయలేకయాయి. అక్రమ కేసులు, వేధింపులతో మనస్థాపానికి గురైన రవి మూడునెలల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బీఆర్ఎస్ అండతో తిరిగి కోలుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ధనమదాన్ని ధిక్కరించి సర్పంచ్ బరిలో నిలిచి గెలిచిన సైనికుడికి గ్రామస్తులు నీరాజనాలు పడుతున్నారు. ఆర్మీ రవి విజయం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం, ఆనందం నింపింది.