హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 29: ఓ గిరిజన బాలికపై సామూహిక లైంగికదాడి జరిగిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. పదోతరగతి చదువుతున్న బాలిక ఆదివారం సాయంత్రం ఇంటివద్ద ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మాయమాటలతో మడద రోడ్డులోని ఒక పాడుపడిన గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం మరో ఇద్దరు యువకులను పిలిపించాడు.
ముగ్గురు కలిసి బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. కూతురు కనిపించడం లేదని బాలిక తల్లి వెతుకుతుండగా కొన్ని గంటల అనంతరం బాలికను ఇంటికి సమీపంలో దించివెళ్లారు. బాలికకు మూర్ఛ సమస్య ఉండటంతో తల్లి ఎక్కువగా ప్రశ్నించలేదు. ఏం జరిగిందనే విషయాన్ని సోమవారం కూతురిని ఆరాతీసింది. లైంగికదాడి విషయం చెప్పడంతో సోమవారం ఆమె హుస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికను సిద్దిపేట దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. బోనాల శేఖర్, మల్యాల ప్రభాస్, గుర్రం భరత్‌ను అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్టు ఏసీపీ తెలిపారు.
లైంగికదాడికి పాల్పడిన సమయంలో ముగ్గురు యువకులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించినట్టు తెలిసింది. ఘటనా స్థలంలో మరో ఇద్దరు బాలురు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం.
లైంగికదాడికి పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతినాయక్, టీజీవీఎస్ జిల్లా ఇన్చార్జి తిరుపతినాయక్, లంబాడా ఐక్య వేదిక జోనల్ ఇన్చార్జి గుగులోతు లక్పతినాయక్, గిరిజన నాయకులు రైనానాయక్, మాలోతు రాజునాయక్ డిమాండ్ చేశారు. గిరిజన బాలికలపై దాడులను అరికట్టాలని, నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు.