ఆదిలాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన ప్రాజెక్టును తామే చేపట్టామని చెప్పుకొనేందుకు కాంగ్రెస్ సర్కార్ సదరు ప్రాజెక్టుకు తాజాగా ట్రయల్ రన్ నిర్వహించింది. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన చనాక-కొరాట ప్రాజెక్టుకు అధికారులు బుధవారం ట్రయల్ రన్ నిర్వహించారు. 2023 సెప్టెంబర్ 28న మొదటిసారి ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను నీటిని మోటర్ల ద్వారా కాలువల్లోకి వదిలారు. బుధవారం అధికారులు మరోసారి ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో కొరాట వద్ద మహారాష్ట్ర సరిహద్దులో పెన్‌గంగా నదిపై చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసింది.
అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి హరీశ్‌రావు మహారాష్ట్ర సీఎం, మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణానికి రెండు రాష్ర్టాలు ఆమోదం తెలిపాయి. ఇందుకు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.451.46 కోట్లు మంజూరు చేసింది. పంప్‌హౌస్ నిర్మాణ పనులకు రూ.118.92 కోట్లు కేటాయించింది. పెన్‌గంగా ప్రాజెక్టుకు రాష్ట్రంలో నిర్మించే కాలువలకు మహారాష్ట్ర సర్కార్ రూ.1,227 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరిధిలో గల 89 గ్రామాల పరిధిలోని 51 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
బరాజ్ నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్, విద్యుత్తు సబ్స్టేషన్లను అప్పట్లోనే బీఆర్ఎస్ సర్కార్ నిర్మించింది. పంప్‌హౌస్‌లో 5.5 మెగావాట్ల చొప్పున మూడు మోటర్లు, 12 మెగావాట్ల చొప్పున మూడు మోటర్లను బిగించారు. పంప్‌హౌస్ నుంచి కాలువల్లో 42 మీటర్ల ఎత్తులో నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు 2023 సెప్టెంబర్ 28న ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. దాదాపు 28 నెలల తర్వాత అధికారులు మరోసారి మోటర్లు ఆన్‌చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. పంప్‌హౌస్ నుంచి నీటిని ప్రధాన కాలువల్లోకి వదిలారు. పిల్ల కాలువలు నిర్మించకుండా ప్రధాన కాలువల్లోకి నీటిని వదిలితే ప్రయోజనం లేదని రైతులు అంటున్నారు.