హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 81 మంది తహసీల్దార్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వారికి డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు కూడా పదోన్నతుల్లో స్థానం కల్పించింది. తహసీల్దార్లకు ప్రమోషన్లు ఇవ్వడంపై ట్రెసా రాష్ట్ర ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్‌కుమార్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం సోమవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. అర్హత కలిగిన తహసీల్దార్లను డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించాలని కోరగా, 81 మంది పదోన్నతులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటనే రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సీసీఏల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులను జారీ చేశారు. అంతకుముందు 19 మందికి పదోన్నతులు ఇచ్చారు. దీంతో చరిత్రలో మునుపెన్నడూలేనివిధంగా 100 మందికి పదోన్నతులు రావడంతో రెవెన్యూ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన్నె ప్రభాకర్, కే నిరంజన్, పాక రమేశ్, కే రామకృష్ణ, రమణ్‌రెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు.