కోనరావుపేట, ఫిబ్రవరి 10 : ‘మొక్కలు నాటాలి.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది.. ఇంటికి ఐదు మొక్కలు పెంచాలి’ అంటూ ప్రతి ప్రభుత్వ సమావేశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులే మొక్కల పాలిట శాపంగా మారారు. రోడ్డు పక్కన ఉన్న చెట్లను మేకలు మేస్తే కాపరికి, ఇంటి ఎదుట పెరిగిన చెట్టు కొమ్మలను నరికి వేస్తే యజమానికి జరిమానా విధించి అధికారులే.. ఏపుగా పెరిగిన పదుల సంఖ్యలో చెట్లను నరికేసి, ఆ చెట్ల దుంగలను మాయం చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో వెలుగుచూసింది.
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో గత ప్రభుత్వ హ యాం లో హరితహారం పథకం ద్వారా మొక్కలు నాటారు. అవి ఇప్పుడు ఏపుగా పెరిగి చెట్లుగా మారాయి. ఆయా పనుల కోసం మండల కార్యాలయానికి వచ్చిన ప్రజలకు ఆ చెట్లు సేద తీర్చుకునేందుకు నీడ నిచ్చేవి. ప్రస్తుత ప్రభుత్వం మండలానికో మాడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మించేందుకు అధికారులు ఈ చెట్లు ఉన్న స్థలాన్నే కేటాయించారు. చెట్లు నరికివేయడమే కాకుండా, దుంగలు మాయమవ డం చూస్తే కంచే చేను మేసినట్టుగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు.