నల్లగొండ : గ్రీన్ ఇండియా చాలెంజ్ బృందం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తర్ణలో కోల్పోతున్న సుమారు యాభై ఏండ్ల వయసున్న పెద్ద పెద్ద వృక్షాలకు పునరుజ్జీవం పోస్తున్నారు గ్రీన్ ఇండియా చాలెంజ్ సభ్యులు. నల్లగొండ మున్సిపల్ కమిషనర్ రమణాచారి విజ్ఞప్తి మేరకు రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ ‘ట్రీస్ ట్రాన్స్ లొకేషన్’ కార్యక్రమానికి పూనుకున్నారు.
మంగళవారం నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, మున్సిపల్ కమిషనర్ కె.వి. రమణాచారి, గ్రీన్ ఇండియా, వాటా ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలోని ఎస్పీ బంగ్లా ముందు వేప, చింత, రాగి, మర్రి చెట్లను వేర్లతో సహ పెకిలించి, పెద్ద క్రేన్ల సాయంతో పెద్ద ట్రక్కులలో చెట్లను తరలించారు.
నల్లగొండ బైపాస్‌లోని చర్లపల్లి అర్బన్ పార్క్‌లో ఈ చెట్లను తిరిగి నాటారు. వాటా ఫౌండేషన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఈ చెట్లు మోడు వారకుండా సైంటిఫిక్ పద్ధతుల్ని అనుసరించి చెట్లు తిరిగి జీవం పోసుకొని చిగురించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
రోడ్ల వెడల్పు వల్ల నల్లగొండ పట్టణంలో మెత్తం 200 పైగా చెట్లు తొలగిస్తున్నామని, వాటి అన్నింటిని దశల వారీగా ఆగస్టు మాసంలోపు ట్రాన్స్ లోకేషన్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. మెదటి ఫేజ్‌లో 50 వృక్షాల్ని ట్రాన్స్ లొకేషన్ చేసే ప్రక్రియను ఈ రోజు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు సంస్థల కలెక్టర్ రాహుల్ శర్మ, వాటా ఫౌండేషన్ ప్రతినిధి మురిళి, పలువురు ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.