జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 24 : జాతీయ రహదారి-44 ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు మంటలు అంటుకొని దగ్ధమైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, ప్రయాణికుల కథనం మేరకు.. సలీం ట్రావెల్స్ బస్సు ఆదివారం రాత్రి బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి శివారులోకి రాగానే బస్సు వెనుక ఉన్న ఒక టైర్ పేలి పెద్ద శబ్దం వచ్చింది. అయినా బస్సు డ్రైవర్ ఒకే టైర్ మీద బస్సును ముందుకు నడపగా.. కొద్దిసేపటికే పేలిన టైర్ నుంచి మంటలు రావడాన్ని బస్సు వెనుక సీటులో కూర్చొన్న ప్రయాణికులు గుర్తించి డ్రైవర్‌కు సమాచారం అందించారు. దీంతో రోడ్డు పక్కనున్న ఓ పెట్రోల్‌బంక్ సమీపంలో బస్సును నిలిపాడు. అప్పటికే మంటలు ఎక్కువై బస్సుకు అంటుకోగా.. భయంతో ప్రయాణికులు 38 మంది కిందికి దిగారు. మంతటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్థమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కమలాకర్ తెలిపారు.