హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దాదాపు రూ. కోటి విలువైన సన్నబియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సహకరించిన పౌరసరఫరాలశాఖకు చెందిన రెండు గోదాముల ఇన్‌చార్జ్‌లను ఆశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సస్పెండ్ చేశారు. కాప్రా గోదాం ఇన్చార్జి, అసిస్టెంట్ మేనేజర్ కల్పనాబాయి, రామంతాపూర్ గోదాం ఇన్చార్జి, అసిస్టెంట్ గ్రేడ్-1 అధికారి పాండురంగారావుపై వేటు వేసినట్టు తెలిసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసినా, అధికారులు గోప్యంగా ఉంచినట్టు సమాచారం.
ఈ వ్యవహారం బయటకొస్తే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వస్తాయనే భయంలో అధికారులు ఉన్నట్టుగా తెలిసింది. మూడురోజుల క్రితం విజిలెన్స్, సివిల్ సప్లయ్ అధికారులు మేడ్చల్ జల్లా తుర్కపల్లికి చెందిన పౌరసరఫరాలసంస్థ గోదాముకు అక్రమంగా తరలిస్తున్న 580 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని పట్టుకున్నారు. తుర్కపల్లికి చెందిన హనుమాన్ రైస్‌మిల్లు యజమాని రేషన్ బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో సదరు గోదాముకు తరలించినట్టుగా నిర్ధారించారు. దీంతో కమిషనర్ చౌహాన్ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
పౌరసరఫరాల సంస్థ అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఇద్దరు అధికారులు అంతకుముందే మరో రెండు లారీల బియ్యాన్ని వారి గోదాముల నుంచి రైస్ మిల్లులకు తరలించినట్టుగా గుర్తించినట్టు సమాచారం. గోదాముల్లో తనిఖీలు చేయగా 2000 టన్నుల బియ్యం తక్కువగా ఉన్నాయని ఓ కీలక అధికారి తెలిపారు. ఈ విధంగా పేదలకు దక్కాల్సిన సన్నబియ్యాన్ని రైస్ మిల్లర్లు, గోదాం ఇన్చార్జులు, రేషన్‌డీలర్లు కుమ్మక్కయి గోదాముల నుంచే టన్నులకు టన్నులు మాయం చేస్తున్నట్టుగా తెలిసింది.