హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ) : ఎన్నికలకు ముందు క్యాబ్ డ్రైవర్లకు హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ బేస్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ విమర్శించాయి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి, రవాణాశాఖ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితంలేదని ఆయా సంఘాల నేతలు మండిపడ్డారు. ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వమే ఒక యాప్ తీసుకొస్తుందని మాటిచ్చిన రేవంత్‌రెడ్డి హామీని విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాట తప్పడంలో సీఎం రేవంత్‌రెడ్డిని మించిన వారు లేరని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి డ్రైవర్ల ఉపాధి దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 7న క్యాబ్‌లను ఆర్టీఏ కార్యాలయంలో వదిలేసి వెళ్తామని హెచ్చరించారు.