దస్తురాబాద్ ,మే 12 : వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోయి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ నెల 11వ తేదీన ‘నమస్తే’లో ప్రచురితమైన ‘కేంద్రాల్లో ధాన్యం..రైతన్నల దైన్యం’ కథనానికి అధికారులు స్పందించారు. రెండు రోజుల్లోనే నిర్మల్ జిల్లా ద స్తురాబాద్ మండలంలోని కొనుగోలు కేంద్రా లకు 14 లారీలు పంపించి ధాన్యం బస్తాల తరలింపును వేగవంతం చేశారు. మండలంలోని గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 17 కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. యాసం గి సీజన్‌కు దొడ్డు రకం వరి సాగు అధికంగా ఉం డడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసు కువచ్చారు. అయితే తేమ శాతం, హమాలీల కొరత, లారీల సమస్యల కారణంగా తూకం వేయడంలో ఆలస్యమైంది. తూకం వేసిన బస్తాలు కేంద్రాల్లో నిల్వ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాల్లో 17,996 క్వింటాళ్ల ధాన్యాన్ని తూకం వేశారు. మొత్తం 25,901 ధాన్యం బస్తాలు కేంద్రాల్లో నిల్వ ఉండగా, వాటి తరలింపునకు 26 లారీలు అవసరం ఉంది. రైతుల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లో 14 లారీలు పంపించి, దాదాపు 10 వేల ధాన్యం బస్తాలు రైస్ మిల్లులు, గోదాంలకు తరలించినట్లు వెల్లడించారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో కొంతమేర నిల్వలు భారం తగ్గిందని రైతులు తెలిపారు.