స్వామీ రామానంద తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో అల్లికలు, కుట్టు శిక్షణ కేంద్రం
కమలాపూర్‌లో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు
ఇప్పటి వరకు 300మందికి పైగా శిక్షణ
కమలాపూర్, మార్చి 23;మహిళలు వంటింటికే పరిమితం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు వారు కూడా పురుషులతో పోటీ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ఇచ్చే శిక్షణను ఉపయోగించుకొని తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. కమలాపూర్ మండలకేంద్రంలో రామానందతీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో అల్లికలు, కుట్టుమిషన్‌పై ఉచిత శిక్షణ ఇస్తుండగా, చుట్టు పక్కల గ్రామాల మహిళలు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ మహిళలు, యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 2017లో స్వామీ రామానందతీర్థ ట్రస్టును కమలాపూర్‌లో నెలకొల్పారు. దీనికి కమలాపూర్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు వసతులు కల్పిస్తున్నది. ఇక్కడ అల్లికలు (ఎంబ్రాయిడరీ), కుట్టుమిషన్‌పై ట్రస్టు ట్రైనర్లు ఉచితంగా రెండు నెలలపాటు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్ 20 మంది వరకు ఉంటారు. ఇప్పటి వరకు 15బ్యాచ్‌లకు అంటే సుమారు మూడువందల మందికిపైగా శిక్షణ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. అల్లికలు, బటన్పాల్, ముడికట్టు, జిగ్‌జాగ్, జరీపూస, మిర్రక్ వంటి 23రకాల డిజైన్లు నేర్పిస్తున్నారు. డిజైన్‌ను బట్టి మార్కెట్లో రూ.వెయ్యికి పైగా ధర పలుకుతుంది. కొంతమంది మహిళలు బ్లౌజ్పీస్లపై డిజైన్లు వేయడం, మరికొందరు పంజాబీ డ్రెస్‌లు, ప్రాక్స్, పిల్లల డ్రెస్సులు, షాట్స్, మాస్క్‌లు కుట్టడం వంటివి నేర్చుకుంటున్నారు. మండలంలోని కమలాపూర్, ఉప్పల్, కానిపర్తి, దేశరాజ్‌పల్లి, గూడూరు, వంగపల్లి, పంగిడిపల్లి, కన్నూరు, భీంపల్లి, శనిగరం, అంబాల, శ్రీరాంలపల్లి, శంభునిపల్లి తదితర గ్రామాల మహిళలు అల్లికలు, కుట్టుమిషన్‌పై శిక్షణ తీసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.
డిజైన్లు నేర్చుకుంటున్నా
ఇప్పటి వరకు 22 రకాల డిజైన్లు నేర్చుకున్నా. బ్లౌజ్‌లపై వేసిన డిజైన్లకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో శిక్షణ తీసుకుంటున్నా. పూర్తిగా నేర్చుకుని ఇంటి వద్దనే బ్లౌజ్‌లపై డిజైను వేసుకునేందుకు ఉపయోగపడుతుంది. డబ్బులు సంపాదించుకునేందుకు అల్లికలు ఉపయోగపడుతాయి. – కేత కమలాపూర్
అల్లికలు నేర్చుకుంటున్నా..
భవిష్యత్‌లో ఒకరిపై ఆధారపడకుండా అల్లికలు నేర్చుకుంటున్నా. బ్లౌజ్‌లపై వేసే రకరకాల డిజైన్లకు మార్కెట్ మంచి డిమాండ్ ఉంది. ఇంటి వద్ద ఉంటూనే ఈ పని చేసుకోవచ్చు. రెండు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నా. – దాసరి శివాని, గూడూరు
ఉపాధి కోసమే కుట్టు శిక్షణ
కుట్టుమిషన్ నేర్చుకుంటున్నా. పంజాబీ డ్రెస్సులు, ప్రాక్స్, పిల్లల డ్రెస్సులు, యూనిఫాం, షాట్స్, మాస్క్‌లు కుట్టడం నేర్చుకుంటున్నా. నిత్యం కానిపర్తి నుంచి వచ్చి సాయంత్రం వరకు కుట్టుమిషన్‌పై డ్రెస్సుల కటింగ్, కుట్టడం నేర్చుకుంటున్నా.