హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులను రవాణా చేసే విద్యాసంస్థల వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ కలిగి ఉండాలని రవాణాశాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 25,677 విద్యాసంస్థల బస్సులు ఉంటే ఇప్పటి వరకు 17,020 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాయని, మిగిలిన 8,657 బస్సులు కూడా సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు.
15 ఏండ్లు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిరగొద్దని పేర్కొన్నారు. ఆ వాహనాల్లో విద్యార్థులను రవాణా చేస్తే సీజ్ చేయడమే కాకుండా యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాసంస్థల వాహనాల నిర్వహణ బాధ్యత ఆయా యాజమాన్యాలదే అని తెలిపారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకొని వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని అన్ని జిల్లాల రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.