హైదరాబాద్: బడులు ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. తమ పిల్లలకు అవసరమయ్యే బుక్స్, నోట్ బుక్స్, డ్రెస్సులు కొనేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా విద్యార్థులను తీసుకెళ్లే బడి బస్సుల (School Bus) కండీషన్ పైనే ఆందోళన నెలకొంది. ఏ బస్సు ఎక్కడ.. ఎప్పుడు మొరాయిస్తుందో తెలియని అయోమయం. ఈ పరిస్థితి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. స్కూలు బస్సులకు కచ్చితంగా ఫిట్ నెస్ పరీక్షలు చేయించాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో 23వేల వాహనాలు ఉండగా, అందులో 45 శాతం మాత్రమే ఫిట్నెస్పరీక్షలు చేయించుకున్నట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక హైదరాబాద్జిల్లాలోనే 1240 బస్సులుండగా, 950 పైగా బస్సులు సామర్థ్య పరీక్షలు చేయించుకున్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో కూడా 70 శాతం బస్సుల పరీక్షలు చేయించినట్లు స్థానిక ఆర్టీఏ అధికారులు చెప్పారు. ఈనెల 12వ తేదీలో ఫిట్ నెస్ టెస్ట్ చేయించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలు స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
రాష్ట్రంలో దాదాపు 28 వేలకు పైగా విద్యాసంస్థల బస్సులుండగా గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో 13,500 వరకు పాఠశాలలు, కళాశాలల బస్సులు ఉన్నాయి. వీటిలో కాలం చెల్లిన బస్సులు మినహాయిస్తే, 23వేలకు పైగా బస్సులకు తప్పనిసరిగా ఫిట్ నెస్ పరీక్షలు చేయించాలి. మే 15 నుంచి టెస్టులు ప్రారంభించారు. జూన్ 12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. అంతకుముందే ప్రతి బస్సును పరీక్షించి సర్టిఫికెట్ పొందేలా యాజమాన్యాలతో మీటింగ్లు ఏర్పాటు చేశారు. అయినా ఫిటెనెస్ పరీక్షలు చేయించలేని వారికి నోటీసులు జారీచేయనున్నారు. బస్సులతో పాటు వ్యాన్లు, ఆటోలపై కూడా దృష్టిపెట్టారు. విద్యాసంస్థలు ప్రారంభమైన తర్వాత ఎంవీఐ, ఏవీఎంఐ, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో ప్రత్యేక బృందాలు స్కూలు బస్సులను తనిఖీ చేసేందుకు రెడీ అవుతున్నారు.