హైదరాబాద్, ఫిబ్రవరి 7, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థల్లో ట్రాన్స్జెండర్ల హకుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్‌కోషి ఆదేశించారు. ట్రాన్స్జెండర్ల సమస్యలపై అవగాహన కల్పించేందుకు న్యాయ సేవాధికార సంస్థ ప్రభుత్వాధికారులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసింది.
ఈ సందర్భంగా జస్టిస్ శామ్‌కోషి మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్లకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పించాలని, దుస్తుల మార్పిడికి ప్రత్యేక వసతులు కల్పించాలని, వారికోసం ప్రత్యేక షెల్టర్ హోమ్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాన్స్జెండర్లతో అనుచితంగా వ్యవహరిస్తే అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.