హైదరాబాద్, ఫిబ్రవరి15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం వెంటనే అన్ని గురుకులాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం (ట్రైటా) రాష్ట్ర అధ్యక్షుడు రుషీకేశ్ కుమార్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సిబ్బంది సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్ గురువారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు.
ప్రమోషన్లు, ఇవ్వకుండానే పోస్టుల భర్తీ చేపట్టడం వల్ల గురుకుల టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇదేవిషయమై ఇటీవల ప్రజాభవన్లో ధర్నాకు దిగారని గుర్తుచేశారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చిందని, ఎంపికైన నూతన గురుకుల ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇవ్వకుండా కేవలం ఆయా గురుకుల సంస్థలకు మాత్రమే కేటాయిస్తూ నియామక పత్రాలను ఇచ్చిందని పేర్కొన్నారు.