హైదరాబాద్/సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): గాంధీ, ఉస్మానియా దవాఖానలను సుదీర్ఘకాలంగా నడుపుతున్న సూపరింటెండెంట్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్యశాఖలో ఉద్యోగుల బదిలీకి శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యింది. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును యాదాద్రి భువనగిరి జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో నల్లగొండ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజకుమారిని నియమించారు. ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్ మహేశ్వరం టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.
వీరితోపాటు ఇద్దరు మాజీ డీఎంఈలు బదిలీ అయ్యారు. రమేశ్‌రెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, త్రివేణిని మహేశ్వరం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేశారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఇందిరను గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్‌ను నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేశారు. టీవీవీపీ, డీపీహెచ్‌లో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సుల ట్రాన్స్ఫర్ల కౌన్సెలింగ్ కొనసాగుతున్నది.
20 నాటికి కౌన్సెలింగ్ ముగిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోనే కీలకమైన గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్లను ఒకేసారి బదిలీ చేయడంపై వైద్య వర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. కొవిడ్ సమయంలో రెండు దవాఖానలు కీలకంగా పనిచేశాయని చెప్తున్నారు. కొవిడ్ నోడల్ సెంటర్‌గా గాంధీ దవాఖానను డాక్టర్ రాజారావు నడిపించిన తీరు దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని మరికొంత కాలం కొనసాగించాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుత బదిలీల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుననారనే ఆరోపణలు మొదలయ్యాయి. తనకు స్పౌజ్ కేసు కింద రక్షణ ఉన్నా.. పక్క జిల్లాకు బదిలీ చేశారని వరలక్ష్మి అనే స్టాఫ్ నర్సు వాపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి పీహెచ్సీలో పనిచేస్తున్నానని, తన భర్త శ్రీనివాసులు తెల్కపల్లి మండలంలోనే హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్టు చెప్పారు. తాను స్పౌజ్ సర్వీస్ సర్టిఫికెట్ సమర్పించినా మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి బదిలీ చేశారని వాపోయారు. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ పరిధిలో టీజీజీడీఏ మాత్రమే గుర్తింపు పొందిన సంఘంగా ఉన్నది.
నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన సంఘాల్లోని సభ్యులకు బదిలీ నుంచి మినహాయింపు ఉన్నది. టీజీజీడీఏకు 2014లో ఎన్నికలు జరిగాయని, ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు నిరుడు తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతలను ఇద్దరు న్యాయవాదులకు అప్పగించింది. ఈ మేరకు టీజీజీడీఏలో 17జిల్లా కమిటీలు (మెడికల్ కాలేజీ కేంద్రంగా) ఏర్పడ్డాయి. కానీ కేంద్ర సంఘం ఎన్నికలు పూర్తి కాలేదు.
జిల్లా కమిటీల సభ్యులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారని.. సంఘానికి ఎన్నికలు పూర్తి కాలేదు కాబట్టి ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నట్టు కొందరు చెప్తున్నారు. కేంద్ర సంఘం ఎన్నికలు పూర్తయిన తర్వాతే కోర్టు పరిధి నుంచి బయటికి వచ్చినట్టు అవుతుందన్నారు. కాబట్టి మినహాయింపు సిఫారసులు పట్టించుకోవద్దని కోరుతున్నారు. సంఘాల పేరుతో దశాబ్దాలుగా పాతుకుపోయి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారిని బదిలీ చేయాలని కోరుతున్నారు. ఇటీవలే డీఎంఈ కార్యాలయంలోనే నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన డాక్టర్ శేఖర్‌పై మెడికల్ జేఏసీ నేతలు దాడి చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని, బదిలీలను పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరుతున్నారు.