హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా రాచకొండ జాయింట్ కమిషనర్‌గా ఐజీ తరుణ్ జోషి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన డీజీపీ ఆఫీసులో పోలీసు ట్రైనింగ్ ఐజీగా విధులు నిర్వర్తించారు. సైబరాబాద్ కమిషనరేట్ ఉమెన్ సేఫ్టీ విభాగంలో డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న నితికాపంత్ను హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా నియమించారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బీ రోహిత్‌రాజును హైదరాబాద్ సిటీ సౌత్ ఈస్ట్‌జోన్ డీసీపీ, రాచకొండ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విభాగం డీసీపీ బీ బాలస్వామిని హైదరాబాద్ సౌత్ వెస్ట్‌జోన్ డీసీపీగా, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం చేతనను పెద్దపల్లి డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, శుక్రవారం రాత్రి 8 గంటల్లోగా బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు వారంతా శుక్రవారమే బాధ్యతలు స్వీకరించారు.
టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ మార్పు
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పీ రాధాకృష్ణను బదిలీ చేస్తూ శుక్రవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన్ని విధుల నుంచి తప్పిస్తూ.. హైదరాబాద్ సీపీకి అటాచ్ చేశారు. ఏ పోస్ట్ ఇవ్వాలనే అంశాన్ని డీజీపీ అంజనీకుమార్, నగర సీపీ సందీప్ శాండిల్య తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు.