వేములవాడ, జూలై 17: రాష్ట్రంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. సోమవారం వేములవాడ రాజన్నను ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సమావేశమందిరంలో మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
రాజరాజేశ్వర స్వామి దయ, సీఎం కేసీఆర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా 24 గంటల పాటు 15,490 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేశామని తెలిపారు. మెరుగైన విద్యుత్తు సరఫరా వ్యవస్థను సమర్థవంతం చేసిన తరుణంలో 18 వేల మెగావాట్ల అవసరం వచ్చినా.. సరఫరా చేయగలుగుతామని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ నెలలో రోజుకు 3,500 నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్తు వినియోగం పెరిగిందని వివరించారు. రోజుకు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వ్యయంతో విద్యుత్తును కోనుగోలు చేసి నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. రాజన్న ఆలయ అవసరాలకు ప్రత్యేక సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ఈవో కృష్ణప్రసాద్ కోరగా.. ఇండోర్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అనుమతులు ఇస్తామని తెలిపారు. సమావేశంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎండీ రామకృష్ణ, ట్రాన్స్‌కో ఎస్ఈ గంగాధర్, డీఈ ఈశ్వర్ ప్రసాద్, ఏడీ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.