హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథమ్)లో మహిళలు, మత్స్యకారులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిథమ్, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కో-ఆపరేటివ్ మేనేజ్మెంట్, తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ సహకారంతో మత్స్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఒకో బృందానికి 30 నుంచి 40 మంది మహిళలు, మత్స్యకారులను ఎంపికచేసి రాష్ట్రవ్యాప్తంగా 20 బృందాలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. చేపలతో రుచికరమైన వంటల తయారీ, స్టాళ్ల నిర్వహణ, ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకం, మేలైన యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు వివరించారు. మృగశిర సందర్భంగా ఏటా జూన్ 7, 8, 9 తేదీల్లో అన్ని జిల్లాల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్‌ను నిర్వహించనున్నట్టు చెప్పారు.