హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): పని ఒత్తిడిని తగ్గించడానికి ఏర్పాటు చేసిన వర్క్‌షాప్ తమ మీద మరింత భారం పెట్టిందని పీఆర్వోలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండున్నరేండ్ల సెల్ఫ్ అప్రైజల్తోపాటు, ఆయా శాఖలకు సంబంధించిన ప్రతికూల వార్తల వివరాలు, అధికారిక ట్వీట్లు, రీట్వీట్లు, వ్యాసాల వివరాలు తీసుకురావాలని సీపీఆర్వో ఉత్తర్వులు ఇవ్వడంతో పీఆర్వోలు భయపడుతున్నారు.
నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించడానికి నిర్వహించే శిక్షణ తరగతులు.. వ్యక్తిగత పనితీరు, ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడాలి కానీ, ఆ పేరుతో తమ మీద మరింత మానసిక ఒత్తిడి పెంచేలా చేస్తున్నారని వాపోయారు. సబ్జెక్టు నిపుణుల చేత శిక్షణ తరగతులు నిర్వహించాలే.. కానీ వృత్తిపరమైన నైపుణ్యం లేని వక్తలు, జర్నలిజంతో ఏమాత్రం సంబంధం లేని అధికారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కనీసం అధికారులు తమ నుంచి ఏం ఆశిస్తున్నారో కూడా అర్థం కావడం లేదని వాపోయారు. భట్టి విక్రమార్క సీపీఆర్వో మధుసూదన్ గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో.. పీఆర్వోలు ఒత్తిడికి గురి అవుతున్నారని, వారు వృత్తిపరమైన లోపాలు అధిగమించి, మెరుగైన ఫలితాలు రాబట్టడం కోసం రాష్ట్రప్రభుత్వం ఈనెల 2 నుంచి వారికి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది.
శిక్షణ ద్వారా సులువుగా పని చేయడం, ఆయా మంత్రుల వ్యాఖ్యల్లోని ప్రాముఖ్యతను గుర్తించి, వార్తగా మలచి సకాలంలో మీడియా సంస్థలకు ఇవ్వడం ఎలా..? అనే అంశం మీద తరగతులు నిర్వహిస్తారని చెప్తున్నారు. తరగతుల నిర్వహణ కోసం ముగ్గురు వక్తలను ఏర్పాటు చేయగా.. వారికి ప్రభుత్వంలో పీఆర్వోగా పని చేసిన అనుభవం లేదని పెదవి విరుస్తున్నారు. ఈ తరగతులు నిర్వహిస్తున్న అధికారికి ముఖ్యమంత్రి, పౌర సంబంధాల శాఖ మంత్రితో సాన్నిహిత్యం మినహా జర్నలిజంతో ఏమాత్రం సంబంధం లేదని, ఇటువంటి వాళ్లు తమకు ఏం శిక్షణ ఇస్తారని పీఆర్వోలు ఆరోపిస్తున్నారు.