హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): నాగ్పూర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదరణ తగ్గింది. ఎక్స్ప్రెస్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పడిపోవడంతో ఈ రైలులో 20 బోగీలు ఉండగా, వాటిని 8కి కుదించారు.
ఆక్యుపెన్సీ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. అలాగే విశాఖపట్నం-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రయాణికుల సంఖ్య రద్దీగా ఉండటంతో 16 నుంచి 20 వరకు బోగీలను పెంచారు. అలాగే సికింద్రాబాద్ – తిరుపతి రైల్వే మధ్య రైలులో మొదటి నుంచి 16 బోగీలు నిండుతున్నాయి. హైదరాబాద్-బెంగుళూరు మధ్య నడిచే వందేభారత్ రైలు 8 బోగీలు ఉన్నప్పటికీ అవి కూడా పూర్తిస్థాయి ప్రయాణికులతో నడుస్తున్నాయి.