జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో విషాదం నెలకొని ఉంది. రెండేళ్ల వయస్సులో తండ్రి ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి వచ్చిన కొద్ది గంటల్లోనే కుమారుడు రోడ్డు ప్రమాదం(Road accident)లో దుర్మరణం చెందడం వారి కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వివరాలు .. పట్టణంలోని మహాలక్ష్మినగర్కు చెందిన చౌట్పల్లి మోహన్, పద్మిని ల కుమారుడు శివకార్తిక్(12) 5వ తరగతి చదువుతున్నాడు.
తండ్రి మోహన్ ఉపాధి నిమిత్తం పదేళ్ల క్రితం సౌదీ అరేబియా(Saudi Arabia)వెళ్లాడు. సోమవారం ఉదయం ఆయన తిరిగి రావడంతో కుటుంబసభ్యులు ఎయిర్పోర్టుకు వెళ్లి తీసుకు వచ్చారు. అయితే ఇంట్లో తాగునీరు అయిపోవడంతో తాను తీసుకొస్తానని కుమారుడు శివకార్తిక్ ద్విచక్రవాహనంపై వెళ్లాడు. బైపాస్ రహదారిలోని దేవిశ్రీ గార్డెన్ సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నాడు.
తీవ్రగాయాలవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. మృతదేహాన్ని చూసి తండ్రి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.