వయసు మళ్లిన అమ్మానాన్నలకు ఆసరా అవుదామనుకున్నది. భర్తను ఎలాగోలా ఒప్పించింది. పుట్టింటికి పయనమై వచ్చింది. ఇక్కడే కన్నవారిని కంటికి రెప్పలా చూసుకుంటూ, కడుపున పుట్టిన వారిని సాదుకుంటూ భార్యాభర్తలు హాయిగా ఉండసాగారు. బతుకు దెరువు కోసం కౌలు వ్యవసాయం చేయాలని ఆ ఇల్లాలు నిర్ణయించుకున్నది. ఉన్న ఊరిలో తానే ముందుకు నడిచి అప్పులు తెచ్చింది. 8 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచేశారు. పంట సరిగా పండక దిగుబడి తగ్గింది. గిట్టుబాటు ధర కూడా రాలేదు. అన్నీపోను ఇంకా రూ.2 లక్షల అప్పు మిగిలే ఉన్నది. వాటిని తీర్చేదారిలేక పుట్టిన ఊరిలో మాటపడలేక పురుగుల మందు తాగి తనువు చాలించింది. ఆమె మరణంతో భర్త, పిల్లలు, కన్న తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఆ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందనిద్రాక్ష అయింది. మహిళా కౌలు రైతు ఆత్మహత్యపై ఈ పాలకులు కనీసం విచారణ కూడా జరపలేదు.
Telangana | కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గూడెన్‌ఘాట్ గ్రామానికి చెందిన కోలవేణి రాజయ్య, లక్ష్మి దంపతుల కూతురు సుమలత (30). 16 ఏండ్ల క్రితం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు రిషిత్, రోషిణి కలిగారు. గూడెన్‌ఘాట్ గ్రామంలో ఉండే తల్లిండ్రులు వృద్ధు లు కావడం, అనారోగ్యంతో బాధపడుతుండటంతో సుమలత నిరుడు తన భర్తను ఒప్పించి అమ్మానాన్నకు ఆసరా అవుదామని గూడెన్ఘాట్కు కుటుంబంతో వచ్చింది. ఇక్కడే 8 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసింది. సొంత భూమి ఏమాత్రం లేకపోవడంతో ఎకరానికి రూ.8 వేల చొప్పున కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచేశారు. దానిసాగు కోసం ఆ కుటుంబం అప్పు చేసింది. సుమారు 35 క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. పెట్టుబడులు పెరగడంతోపాటు పత్తికి సరైన గిట్టుబాటు ధర రాలేదు. దీంతో సుమలత దంపతులకు రూ.2 లక్షల అప్పు మిగిలి ఉంది. ఆ అప్పులను తలుచుకొని వారు తీవ్ర మనోవేదనకు గురయ్యేవారు. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక, పుట్టిన ఊరు కావడంతో మనస్తాపం చెంది నిరుడు మార్చి 12న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. ఆమె మరణంతో పిల్లలు తల్లిలేని అనాథలు కాగా, తల్లిదండ్రులు దిక్కులేనివారయ్యారు.
మహిళా కౌలురైతు సుమలత ఆత్మహత్య చేసుకొని ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కౌలుసాగుతో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నదన్న విషయాన్ని కూడా ప్రభుత్వం నమోదు చేసుకోలేదు. ఏ అధికారి కూడా విచారణ చేపట్టలేదు. అధికార పార్టీ నాయకులెవరూ ఆ ఇంటి దిక్కు రానేలేదు. ఎవరూ పట్టించుకోలేదని బాధిత కుటుంబం బావురుమంటున్నది. తల్లిదండ్రులకు సాయం ఉంటానని సొంతూరు వచ్చిన సుమలత.. కౌలు వ్యవసాయం చేసి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నదని స్థానికులు తెలిపారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ముసలోళ్లమైన మాకే మా బిడ్డ అండగా ఉంటదనుకున్నం. భర్త, పిల్లలతో కలిసి మా ఇంటికొచ్చింది. 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసిన్రు. పంటపండక పూర్తిగా నష్టపోయిన్రు. 2 లక్షల దాకా అప్పు పడింది. అప్పులను తల్సుకొని బిడ్డ సుమలత ఎప్పుడూ బాధపడుతూ తనువు తీసుకున్నది. కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాకెలాంటి సాయం అందలేదు.