హైదరాబాద్ : మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర మొదలైంది. వనదేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తుండడంతో మేడారం జాతరకు వెళ్లే పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పలు గ్రామాల మీదుగా వన్ వేను పోలీసులు అమలు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లి మీదుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు. కమలాపూర్, రాంపూర్, గొల్లబుద్ధారం, భూపాలపల్లి ప్రజలు దూదేకులపల్లి మీదుగా రావొద్దని భూపాలపల్లి ఎస్పీ సూచించారు. ఆయా గ్రామాల వారంతా ప్రజలు ఘన్పూర్ క్రాస్ రోడ్డు మీదుగా మేడారం వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్కు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు భక్తులు సహకరించాలని కోరారు.