హైదరాబాద్: హైదరాబాద్ ఖైరతాబాద్‌లో బుధవారం బడా గణేశ్ (Bada Ganesh) కొలువు దీరనున్నాడు. గణనాథుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ (Khairatabad) చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) విధించారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ఖైరతాబాద్, షాదన్ కాలేజీ, నిరంకారి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, మింట్‌కాంపౌండ్, నెక్లస్ రోటరీ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని తెలిపారు. ఈ నేపథ్యంలో పది రోజులపాటు వాహనాలు దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
బడాగణేశ్ దర్శనానికి నెక్లస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ నుంచి వచ్చే వాహనాలను రేస్రోడ్, ఎన్టీఆర్ఘాట్, హెచ్ఎండీఏ పార్కింగ్ బిసైడ్ ఐమాక్స్ థియేటర్, ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఓపెన్ ప్లేస్‌లో, సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ప్రెమిసెస్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. బడాగణేశ్ దర్శనానికి ఖైరతాబాద్ జంక్షన్ నుంచి వచ్చే విశ్వేశ్వరయ్యభవన్‌లో పార్క్ చేయాలని సూచించారు. ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి వచ్చే భక్తులు మెట్రోరైలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల ద్వారా రావాలని సూచించారు.