హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 30: హనుమకొండ నగరాన్ని వరద ముంచెత్తింది. మొంథా తుఫాన్ ప్రభావంతో నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బుధవారం రోజంతా కురిసిన వర్షానికి రోడ్ల నీళ్లు వరదలా ప్రవహించాయి. హనుమకొండలోని అలంకార్ బ్రిడ్జి, కేయూ బైపాస్ రోడ్ పెద్దమ్మగడ్డ సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటువైపు రాకపోకలను నిలిపివేశారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. హనుమకొండ చౌరస్తా మీదుగా వరంగల్‌కు అంతరాయం ఏర్పడింది. అలంకార్ జంక్షన్, ములుగురోడ్, అజరా హాస్పిటల్‌కు వెళ్లేందుకు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు వరద ఉద్రిక్తత ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రయాణికులు తెలియక అటువైపు రావడంతో ఎటువెళ్లాలో తెలియక అయోమయానికి గురయ్యారు. యాదవ్‌నగర్ మూలమలుపు వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. 4వ డివిజన్లోని జ్యోతిబసు నగర్‌కాలనీ, పెద్దమ్మగడ్డ కాలనీలు, అలంకార్ జంక్షన్‌లోని పలు కాలనీలు నీటమునిగాయి. పోలీసులు, ఫైర్‌సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వరంగల్‌కు కాపువాడ మీదుగా వాహనాలను తరలించారు.
