సిరిసిల్ల టౌన్, మార్చి 5: నేతన్నలను అవమానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్లలో నేతన్నలను మాఫియా అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డికి నేతన్నలు, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా కోసమే నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, నేతన్నలు తాగుబోతులని గతంలోనూ రేవంత్‌రెడ్డి అవహేళన చేశారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.1,200 కోట్లు ఇచ్చి నేతన్నల అభ్యున్నతికి పాటుపడిందని చెప్పారు. జైలులో చిప్పకూడు తిని వచ్చిన రేవంత్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను విమర్శించే స్థాయి, నైతికత లేదని అన్నారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఇదే సిరిసిల్ల అభివృద్ధికి, పద్మశాలీల అభివృద్ధికి ప్రభుత్వ చేసిన కార్యక్రమాలపై తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ అరుణ, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ నర్సయ్య పాల్గొన్నారు.