CM KCR | హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభవార్త చెప్పారు. నాలుగేండ్ల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్నవారిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. వారి పనితీరు, మార్గదర్శకాలను అనుసరించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్రను ప్రశంసించారు. తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృషి ఉన్నదని అభినందించారు. పంచాయతీ కార్యదర్శుల నిరంతర కృషి కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో వారిని రెగ్యులరైజ్ చేసే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి, పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావును ఆదేశించారు.
గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించటం, మొకలు నాటించడం, వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించటంతో పాటు పలు రకాల బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. ఈ లక్ష్యాలను పూర్తి మూడింట రెండు వంతులు చేరుకున్నవారిని క్రమబద్ధీకరించాలని సమీక్షలో నిర్ణయించారు. దీన్ని జిల్లా స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. సమీక్షలో మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, ప్లానింగ్ బోర్డ్ వైస్‌చైర్మన్ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తకెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు బాల సుమన్, జీవన్‌రెడ్డి, సుంకె రవిశంకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ శాంతికుమారి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, సీఎంవో కార్యదర్శులు స్మితాసబర్వాల్, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంతరావు, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఈఈ శశిధర్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, ఉపాధ్యక్షుడు నేతి మంగ, యూసుఫ్‌మియా, వేద పండితులు గోపికృష్ణశర్మ, కల్వకుంట్ల వంశీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్ఏలను వారి వారి విద్యార్హతలు, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వీఆర్ఏలతో చర్చించి, వారి అభిప్రాయాలు తీసుకొని, చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారు. వారంలోగా ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఉపసంఘం సూచనల మేరకు వీఆర్ఏల సేవలు వినియోగించుకోవాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రివర్గ ఉపసంఘం బుధవారం నుంచి వీఆర్ఏలతో చర్చలు ప్రారంభించనున్నది. సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయంపై నిర్ణయించటంపై ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. వీఆర్ఏలతో చర్చలు జరపాలని ఆదేశించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వీఆర్ఏల అర్హతలను బట్టి సర్దుబాటు చేయాలని తీసుకొన్న నిర్ణయం గొప్పదని, గ్రామానికి ఒకరు లేదా ఇద్దరు వీఆర్ఏలను కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అటు.. గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన ‘చీఫ్ మినిస్టర్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ సీం (సీఎంఎస్టీఈఐ)’ లబ్ధిదారుల విజయగాథల పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.