కవాడిగూడ, ఫిబ్రవరి 1: ప్రభుత్వం పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని టీపీడీఎమ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సూర్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీపీడీఎమ్ఏ) ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సెక్రటేరియట్‌కు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. 16 నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలలను నడపడం కష్టంగా మారిందని వాపోయారు. సిబ్బందికి జీతాలు, భవనాలకు అద్దెలు, అప్పులకు వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.
డిసెంబర్లో ఫీజు బకాయిలను చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. పది రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే కళాశాలలను నిరవధికంగా మూసివేసి పరీక్షలను సైతం నిర్వహించబోమని హెచ్చరించారు. ధర్నాలో టీపీడీఎమ్ఏ కార్యదర్శి యాద రామకృష్ణ, శ్రీధర్‌రావు, పరమేశ్వర్, కోశాధికారి శంకర్, వర్సిటీల అధ్యక్షులు ఉపేందర్‌రెడ్డి, నాగేందర్‌రెడ్డి, సీతారాంరెడ్డి, వెంకటేశ్వర్రావు, సంజీవరెడ్డి, నారాయణగౌడ్ పాల్గొన్నారు.