హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర చిహ్నం మార్పుపై వెనక్కి తగ్గబోమని, మార్చి తీరుతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టంచేశారు. రాష్ట్ర చిహ్నంలో అమరుల స్థూపం ఉంటే బీఆర్ఎస్ నాయకులకు నష్టమేమిటని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో గురువారం పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి భవానీరెడ్డి, బెల్లయ్యనాయక్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
అతి త్వరలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర చిహ్నం తీసుకొస్తామని చెప్పారు. చిహ్నంలో అమరవీరుల స్థూపం ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. అమరుల వల్లే తెలంగాణ వచ్చింది వాస్తవం కాదా?.. దీనిపై ఎందుకు నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణవాదులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా ముందుకు వెళ్తామని తెలిపారు.