హైదరాబాద్, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వంశీ సొంత పార్టీ, సొంత సోషల్ మీడియాపై సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లోకి వెళ్లిందని, సర్వనాశనం అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు ప్రధాన కారణం సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీశ్ అని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని, బయటి వ్యక్తులకు పదవులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో తమకు సరైన గౌరవం దక్కదనే ఉద్దేశంతో సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇందుకు సంబంధించి చైర్మన్ మన్నె సతీశ్‌కు ఘాటు లేఖ రాశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సోషల్ మీడియాపై సమావేశం నిర్వహించలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా బలహీనంగా ఉండటంపై గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎన్నికల వరకు కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్‌గా పనిచేశారని, కానీ తర్వాత ప్రైవేటు సైన్యాన్ని దించారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించు కుని, పదవికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.