హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అగ్రకుల దురంహకారం వల్ల కాంగ్రెస్ పార్టీకి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు దూరమవుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. ఏసీసీసీ నుంచి టీపీసీసీని ఒక ప్రాంచైజీలాగా తెచ్చుకొని పార్టీని ఒక ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చి దానికి తానే ఓనర్ అయినట్టుగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు.
రేవంత్‌రెడ్డి నిరంకుశ వైఖరితో విసిగిపోయి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. తప్పొప్పులను సరిదిద్దాల్సిన ఏఐసీసీ ఇంచార్జ్ మానికం ఠాగూర్, పార్టీ వ్యూహకర్త సునీల్ కూడా రేవంత్‌రెడ్డితో కుమ్మక్కయ్యారని దాసోజు ఆరోపించారు.