TPCC President Mahesh Kumar Goud | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్లో ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న ఆరు స్థానలలో గాను మూడు లేదా నాలుగు బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపింది. ఇక కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి) పేర్లు ఖరారయ్యాయి. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు అందింది. కొత్త మంత్రులు ఈ ఆదివారం మధ్యాహ్నం 12:19 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయిస్తారు.
సామాజిక వర్గాల వారీగా చూస్తే, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేరు ఖరారు కాగా, మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు అవకాశం లభించింది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు నేతలకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కొత్త మంత్రులకు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు ఆయన అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామచంద్ర నాయక్‌కు కూడా మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని అమలు చేస్తుందని, అందుకే కులగణన చేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ నూతన నియామకాలకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.