హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గీతదాటితే చర్యలు తప్పవని, పార్టీ నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడితే సహించేది లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఒకరి శాఖల్లో మరొకరు జోక్యం చేసుకోవద్దని రాష్ట్ర మంత్రులకు తేల్చిచెప్పారు. స్థానిక ఎన్నికలపై మాట్లాడటం సరికాదని మంత్రి పొంగులేటికి స్పష్టం చేయడంతో.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే అలా మాట్లాడినట్టు ఆయన వివరణ ఇచ్చారని వెల్లడించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం వల్ల జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడతామని మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో నిలబడే కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రకటించుకోవడంలో తప్పేమీ లేదని తెలిపారు. ఆ సీటు అభ్యర్థిగా ఎవరు ప్రకటించుకున్నప్పటికీ అది వారి వ్యక్తిగతమేనని, పద్ధతి ప్రకారం దరఖాస్తుల స్వీకరణ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానమే అభ్యర్థిని ఎంపిక చేస్తుందని స్పష్టత ఇచ్చారు.
వరంగల్ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితుల పై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని పరిశీలకులకు సూచించినట్టు చెప్పారు. ఆ రిపో ర్టు ఆధారంగా డీసీసీ నివేదిక ఇస్తుందని, దా ని ఆధారంగా క్రమశిక్షణ చర్యలు చేపడతామని తెలిపారు.