Revanth Reddy | ఖైరతాబాద్, అక్టోబర్ 28: ‘నేను చూసిన కాంగ్రెస్ వేరు.. నేటి రేవంత్ చేతిలో ఉన్న పార్టీ వేరు.. టికెట్లను వేలంలో సరుకు చేశాడు.. 34 ఏండ్లు సేవలందించా.. రేవంత్ చేష్టల వల్లే రాజీనామా చేస్తున్నా’ అని పీసీసీ మైనార్టీ విభాగం చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహైల్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో రేవంత్‌పై దుమ్మెత్తిపోశారు. పార్టీ కోసం 34 ఏండ్లు శక్తివంచన లేకుండా పనిచేశానని తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు వెంగళ్రావు, వైఎస్ఆర్, రోశయ్యతోపాటు కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో పనిచేశానని గుర్తుచేశారు. పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పనిచేసినా ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని చెప్పారు. బస్తీ కమిటీ అధ్యక్షుడి స్థాయి నుంచి నేటి మైనార్టీ విభాగం చైర్మన్ వరకు అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చానని వివరించారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు తీసుకున్నాడో పార్టీ భ్రష్టు పట్టడం మొదలైందని ఆరోపించారు. రేవంత్ నాయకత్వంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖతం కావడం ఖాయమని చెప్పారు. డబ్బులు ఇచ్చిన వారికే పదవులు, పార్టీ టికెట్లు కేటాయించే స్థాయికి దిగజారిపోయిందని, గాంధీభవన్‌ను ఓ షాపింగ్ మాల్గా మార్చివేశారని విమర్శించారు. నాడు రూ.50 కోట్లు లంచం తీసుకొని అప్పటి ఏఐసీసీ ఇన్చార్జి మాణికం ఠాగూర్ పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్నాడని విమర్శించారు. రేవంత్ రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టి అంతకు రెట్టింపు లాభాలకు అసెంబ్లీ టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపించారు. పార్టీ హైకమాండ్ సైతం ఓ సంఘ్ పరివార్ నేతకు పీసీసీ బాధ్యతను అప్పగించడం బాధకలిగించిందని వాపోయారు. తాను ఎన్నడూ టికెట్ ఆశించలేదని, కానీ నేడు జరుగుతున్న టికెట్ల పంపిణీయే తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి కోట్లు గుమ్మరించిన వారికే టికెట్లు కేటాయించాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు తన వద్ద ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని, ఓబీసీ విభాగం చైర్మన్‌గా పనిచేసిన నూతి శ్రీకాంత్‌గౌడ్ పార్టీకి అన్నీ తానై పనిచేశాడని, టికెట్లు కేటాయింపులో మాత్రం మొండి చేయి చూపారని చెప్పారు. మలక్‌పేట టికెట్‌ను ఓ రియల్టర్ అయిన షేక్ అక్బర్‌కు రూ.10 కోట్లకు రేవంత్ అమ్ముకున్నాడని ఆరోపించారు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పేరుతో సర్వే స్కామ్‌కు తెరలేపారని, డబ్బులు చెల్లించిన వారికే ఎక్కువ మార్కులు వచ్చేలా సర్వేలను రూపొందించారని విమర్శించారు. ఈ కుంభకోణం మొత్తం ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లోనే జరిగిందని ఆరోపించారు. ఉదయ్‌పూర్ డిక్లకేషర్కు తూట్లు పొడిచారని, ఖైరతాబాద్ టికెట్‌ను పీ విజయారెడ్డికి కేటాయిస్తున్నామనే సాకుతో ఆమె సోదరుడు విష్ణువర్ధన్‌రెడ్డిని పక్కన పెట్టారని తెలిపారు. అలాంటప్పుడు మైనంపల్లి హన్మంతరావు ఆయన కొడుకు రోహిత్‌రావుకు టికెట్లు ఎలా ఇచ్చారని, ఈ లాజిక్ వారి విషయంలో ఎందుకు వర్తించలేదని నిలదీశారు.
టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం అనేది అపహాస్యం పాలైందని, ఒకప్పుడు సెక్యులర్ పార్టీగా ఉండేదని, నేడు రేవంత్ వ్యవహారంతో అగ్రవర్ణ పార్టీగా మారిపోయిందని సోహైల్ ఆరోపించారు. రేవంత్ కొనుగోలు చేసిన, ఆయనకు మద్దతుగా నిలిచిన నేతలందరూ డిసెంబర్ 3 తర్వాత బీజేపీలో చేరనున్నారని జోస్యం చెప్పారు. మరో వైపు 70 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న బహదూర్‌పుర, చాంద్రాయగుట్ట, యాకుత్‌పుర నుంచి కాంగ్రెస్ తరఫున ముస్లిమేతరులకు టికెట్లు కేటాయించడంలో ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హిందువులు కూడా ఆ స్థానాల్లో పోటీ చేయాలని వాదిస్తున్న రేవంత్.. జూబ్లీహిల్స్ టికెట్‌ను అజారుద్దీన్‌కు ఏ ప్రాతిపదికన కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ నుంచి డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆయనను కాదని, బీజేపీ నుంచి శ్రీనివాస్‌రెడ్డిని దిగుమతి చేసుకొని టికెట్ కేటాయించడంలో రేవంత్ సంఘ్ పరివార్ ఎజెండా అర్థం చేసుకోవాలని సూచించారు. ఇలాంటి వారి వల్ల కాంగ్రెస్‌కు భవిష్యత్ ఉండదని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు.